Telugu Bible · New Testament
1 కొరింథీయులకు 5
1మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు.
2ఇట్లుండియు, మీరుప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి యీలాటి కార్యము చేసిన వానిని మీలోనుండి వెలివేసిన వారు కారు.
3నేను దేహవిషయమై దూరముగా ఉన్నను ఆత్మవిషయమై సమీపముగా ఉండి, మీతోకూడ ఉండి నట్టుగానే యిట్టి కార్యము ఈలాగు చేసినవానినిగూర్చి యిదివరకే తీర్పు తీర్చియున్నాను.
4ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును,
5నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు, అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను.
6మీరు అతిశయపడుట మంచిదికాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరెరుగరా?
7మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను
8గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
9జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని.
10అయితే ఈలోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను, ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా?
11ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్ర హారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
12వెలుపలివారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని
13మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.