Telugu Bible · Old Testament
1 సమూయేలు 24
1సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను.
2అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.
3మార్గముననున్న గొఱ్ఱ దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక
4దావీదు జనులు అదిగోనీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతు నని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను.
5సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
6ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
7ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.
8అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లినా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగ పడి నమస్కారము చేసి
9సౌలుతో ఇట్లనెనుదావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు విను చున్నావు?
10ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించిఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.
11నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రుును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.
12నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను.
13పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను.
14ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి యున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కనుగదా? మిన్నల్లిని గదా?
15యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.
16దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలుదావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి
17దావీదుతో ఇట్లనెనుయెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు
18ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.
19ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక.
20నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచ బడుననియు నాకు తెలియును.
21కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయ కుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను
22అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.