Telugu Bible · Old Testament
2 రాజులు 12
1యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందుయోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధు రాలైన జిబ్యా.
2యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడై యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.
3అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.
4యోవాషు యాజకులను పిలిపించియెహోవా మంది రములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును,
5యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.
6అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరము యొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక
7యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించిమందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను.
8కాబట్టి యాజకులుమందిరములో శిథిల మైన స్థలములను బాగుచేయుట మా వశము లేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి.
9అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.
10పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధాన మంత్రియును ప్రధాన యాజకుడును వచ్చి, యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.
11తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారి కప్పగించిరి; వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్ప కారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని
12యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.
13యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదు గాని
14మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగు చేయించిరి.
15మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.
16అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.
17అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా
18యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషా పాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొనిసిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూష లేమునొద్దనుండి తిరిగిపోయెను.
19యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.
20అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.
21ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.