Connect Christ

Telugu Bible · Old Testament

నిర్గమకాండము 35

Exodus 35 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసిమీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధు లేవనగా

2ఆరు దినములు పనిచేయవలెను; ఏడవది మీకు పరిశుద్ధదినము. అది యెహోవా విశ్రాంతిదినము; దానిలో పనిచేయు ప్రతివాడును మరణ శిక్షనొందును.

3విశ్రాంతి దినమున మీరు మీ యిండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్ట కూడదని వారితో చెప్పెను.

4మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజ ముతో ఇట్లనెనుయెహోవా ఆజ్ఞాపించినదేమనగా

5మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి,

6నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ,

7ప్రదీపమునకు తైలము,

8అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు,

9ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.

10మరియు వివేక హృదయులందరు వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నియు చేయవలెను.

11అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకఱ్ఱలు దాని స్తంభములు దాని దిమ్మలు.

12మందసము దాని మోతకఱ్ఱలు, కరుణా పీఠము కప్పు తెర,

13బల్ల దాని మోతకఱ్ఱలు దాని ఉపకరణములన్నియు, సన్నిధి రొట్టెలు,

14వెలుగుకొఱకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు, దీపములకు తైలము

15ధూపవేదిక దాని మోతకఱ్ఱలు, అభిషేకతైలము పరిమళద్రవ్య సంభారము, మందిర ద్వార మున ద్వారమునకు తెర.

16దహన బలిపీఠము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకఱ్ఱలు దాని యుపకరణములన్నియు, గంగాళము దాని పీట

17ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర

18మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్లు

19పరిశుద్ధస్థలములో సేవచేయుటకు సేవావస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్ర ములు యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను.

20ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుటనుండి వెడలిపోయెను.

21తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పనికొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి.

22స్త్రీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరు యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను తావళ ములను, సమస్తవిధమైన బంగారు వస్తువులనుతెచ్చిరి.

23మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెండ్రుకలు, ఎఱ్ఱరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి యెవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి.

24వెండిగాని యిత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకఱ్ఱ యెవని యొద్దనుండెనో వాడు దాని తెచ్చెను.

25మరియు వివేక హృదయముగల స్త్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును తెచ్చిరి.

26ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరు మేక వెండ్రుకలనువడికిరి.

27ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను లేతపచ్చలను

28సుగంధద్రవ్యమును, దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి.

29మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరు మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి.

30మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;

31యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్ర మైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,

32రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,

33విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియు న్నాడు.

34అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీ యాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.

35చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణముల తోను సన్ననారతోను బుటాపనిచేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పని యైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.