Telugu Bible · Old Testament
హబక్కూకు 2
1ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా
2యెహోవా నాకీలాగు సెలవిచ్చెను చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.
3ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
4వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగ బ్రదుకును.
5మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.
6తనదికాని దాని నాక్ర మించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉప మానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
7వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.
8బహు జనముల ఆస్తిని నీవు కొల్ల పెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నర హత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్ల పెట్టుదురు.
9తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
10నీవు చాల మంది జనములను నాశనముచేయుచు నీమీద నీవే నేర స్థాపనచేసియున్నావు, నీ దురాలోచనవలన నీ యింటి వారికి అవమానము తెచ్చియున్నావు.
11గోడలలోని రాళ్లు మొఱ్ఱ పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యు త్తర మిచ్చుచున్నవి.
12నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.
13జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యముల కధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.
14ఏలయనగా సముద్రము జలము లతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
15తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
16ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్య బడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.
17లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును,పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు జరిగిన బలాత్కారమును బట్టియు ఇది సంభవించును.
18చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమి్మక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమి్మక యుంచుటవలన ప్రయోజనమేమి?
19కఱ్ఱనుచూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచిలెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు.
20అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.