Telugu Bible · Old Testament
యెషయా 40
1మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
2నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతివలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి.
3ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధ పరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.
4ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండ వలెను.
5యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
6ఆలకించుడి, ప్రకటించుమని యొకడు ఆజ్ఞ ఇచ్చు చున్నాడు నేనేమి ప్రకటింతునని మరి యొకడడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది
7యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే.
8గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.
9సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
10ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్దనున్నది ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగానడచుచున్నది.
11గొఱ్ఱలకాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.
12తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?
13యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?
14ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?
15జనములు చేదనుండి జారు బిందువులవంటివి జనులు త్రాసుమీది ధూళివంటివారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువులవలె నున్నవి.
16సమిధలకు లెబానోను చాలకపోవును దహనబలికి దాని పశువులు చాలవు
17ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును.
18కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటిచేయగలరు?
19విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయును కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును
20విలువగలదానిని అర్పింపజాలని నీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకొనును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పని వాని వెదకి పిలుచుకొనును.
21మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా?
22ఆయన భూమండలముమీద ఆసీనుడై యున్నాడు దాని నివాసులు మిడతలవలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశవైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను.
23రాజులను ఆయన లేకుండచేయును భూమియొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపు లుగా చేయును.
24వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.
25నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
26మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.
27యాకోబూనా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు? ఇశ్రాయేలూ, నీవేల ఈలాగు చెప్పుచున్నావు?
28నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము.
29సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
30బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు ¸°వనస్థులు తప్పక తొట్రిల్లుదురు
31యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.