Telugu Bible · Old Testament
యెషయా 64
1గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక.
2నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయురీతిగాను నీవు దిగివచ్చెదవు గాక.
3జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక నీవు దిగివచ్చెదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక.
4తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసియుండలేదు.
5నీ మార్గములనుబట్టి నిన్ను జ్ఞాపకము చేసికొనుచు సంతోషముగా నీతి ననుసరించువారిని నీవు దర్శించు చున్నావు. చిత్తగించుము నీవు కోపపడితివి, మేము పాపులమైతివిు బహుకాలమునుండి పాపములలో పడియున్నాము రక్షణ మాకు కలుగునా?
6మేమందరము అపవిత్రులవంటివారమైతివిు మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతివిు గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను
7నీ నామమునుబట్టి మొఱ్ఱపెట్టువాడొకడును లేక పోయెను నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు నీవు మాకు ముఖము చాటు చేసికొంటివి మా దోషములచేత నీవు మమ్మును కరిగించియున్నావు.
8యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము.
9యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసి కొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమంద రము నీ ప్రజలమే గదా.
10నీ పరిశుద్ధ పట్టణములు బీటిభూములాయెను సీయోను బీడాయెను యెరూషలేము పాడాయెను.
11మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము. మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను మాకు మనోహరములైనవన్నియు నాశనమైపోయెను.
12యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగానుందువా? అత్యధికముగా మమ్మును శ్రమపెట్టుదువా?
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.