Telugu Bible · Old Testament
యిర్మీయా 24
1బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొని పోయిన తరు వాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.
2ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి.
3యెహోవాయిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడు గగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన శక్యముకానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని.
4అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైయీలాగు సెలవిచ్చెను
5ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగావారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదు లను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టు నట్లు లక్ష్యపెట్టుచున్నాను.
6వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్లగింపక వారిని నాటెదను.
7వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను.
8మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
9మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదము గాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
10నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.