Telugu Bible · Old Testament
యిర్మీయా 48
1మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నదిఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
2హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవు నట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయ నుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.
3ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని విన బడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభవించు చున్నది.
4మోయాబు రాజ్యము లయమై పోయెను దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది.
5హొరొనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు ఏడ్చుచు ఎక్కుచున్నారు.
6పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకొనుడి అరణ్యములోని అరుహవృక్షమువలె ఉండుడి.
7నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ము కొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషుదేవత చెరలోనికి పోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.
8యెహోవా సెలవిచ్చునట్లు సంహారకుడు ప్రతి పట్టణముమీదికి వచ్చును ఏ పట్టణమును తప్పించుకొనజాలదు లోయకూడ నశించును మైదానము పాడైపోవును.
9మోయాబునకు రెక్కలు పెట్టుడి అది వేగిరముగా బయలుదేరి పోవలెను. నివాసి యెవడును లేకుండ దాని పట్టణములు పాడగును.
10యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.
11మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నదిదాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
12యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను దానియొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాని కుమ్మరించి దాని పాత్రలను వెలితిచేసివారి జాడీలను పగులగొట్టెదరు.
13ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
14మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు?
15మోయాబు పాడైపోవుచున్నది శత్రువులు దాని పట్టణములలో చొరబడుచున్నారు వారి ¸°వనులలో శ్రేష్ఠులు వధకు పోవుచున్నారు సైన్యములకధిపతియగు యెహోవా అను పేరుగల రాజు సెలవిచ్చినమాట యిదే.
16మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది.
17దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.
18దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు.నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
19ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
21మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
22నెబోకును బేత్‌దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
24మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.
25మోయాబు శృంగము నరికివేయబడియున్నది దాని బాహువు విరువబడియున్నది యెహోవా వాక్కు ఇదే.
26మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్పచేసికొనెను దాని మత్తిల్లజేయుడి మోయాబు తన వమనములో పొర్లుచున్నది అది అపహాస్యమునొందును.
27ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి
28మోయాబు నివాసులారా, పట్టణములు విడువుడి కొండపేటు సందులలో గూడు కట్టుకొను గువ్వలవలె కొండలో కాపురముండుడి.
29మోయోబీయుల గర్వమునుగూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు వారి అతిశయమునుగూర్చియు గర్వమునుగూర్చియు
30అహంకారమునుగూర్చియు పొగరునుగూర్చియు మాకు సమాచారము వచ్చెను వారి తామసమును వచించరాని వారి ప్రగల్భము లును నాకు తెలిసేయున్నవి చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు ఇదే యెహోవా వాక్కు
31కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చు చున్నాను మోయాబు అంతటిని చూచి కేకలు వేయుచున్నాను వారు కీర్హరెశు జనులు లేకపోయిరని మొఱ్ఱపెట్టు చున్నారు.
32సిబ్మా ద్రాక్షవల్లీ, యాజెరునుగూర్చిన యేడ్పును మించునట్లు నేను నిన్నుగూర్చి యేడ్చుచున్నాను నీ తీగెలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను అవి యాజెరుసముద్రమువరకు వ్యాపించెను నీ వేసవికాల ఫలములమీదను ద్రాక్షగెలలమీదను పాడుచేయువాడు పడెను.
33ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
34నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.
35ఉన్నతస్థలమున బలులు అర్పించువారిని దేవతలకు ధూపమువేయువారిని మోయాబులో లేకుండజేసెను ఇదే యెహోవా వాక్కు.
36వారు సంపాదించినదానిలో శేషించినది నశించి పోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశువారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగు చున్నది.
37నిశ్చయముగా ప్రతి తల బోడియాయెను ప్రతి గడ్డము గొరిగింపబడెను చేతులన్నిటిమీద నరుకులును నడుములమీద గోనెపట్టయు నున్నవి.
38మోయాబు ఇంటి పైకప్పులన్నిటిమీదను దాని వీధులలోను అంగలార్పు వినబడుచున్నది ఒకడు పనికిమాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను ఇదే యెహోవా వాక్కు.
39అంగలార్చుడి మోయాబు సమూలధ్వంసమాయెను మోయాబూ, నీవు వెనుకకు తిరిగితివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టునున్న వారికందరికి అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును.
40యెహోవా సెలవిచ్చునదేమనగా పక్షిరాజు ఎగురునట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది.
41కోటలు పడగొట్టబడియున్నవి దుర్గములు పట్టబడి యున్నవి. ఆ దినమున మోయాబు శూరుల హృదయము ప్రసవించు స్త్రీ హృదయమువలె ఉండును.
42మోయాబు యెహోవాకంటె గొప్పవాడనని అతిశయ పడగా అది జనము కాకుండ నిర్మూలమాయెను.
43మోయాబు నివాసీ, భయమును గుంటయు ఉరియు నీమీదికి వచ్చియున్నవి
44ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో పడుదురు గుంటలోనుండి తప్పించుకొనువారు ఉరిలో చిక్కు కొందురు మోయాబుమీదికి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నానుఇదే యెహోవా వాక్కు.దేశ పరిత్యాగులగువారు బలహీనులై హెష్బోనునీడలో నిలిచియున్నారు.
45హెష్బోనులోనుండి అగ్నియు సీహోను మధ్యనుండి జ్వాలలును బయలుదేరి
46మోయాబు శిరస్సును, సందడిచేయువారి నడినెత్తిని కాల్చివేయుచున్నవి. మోయాబూ, నీకు శ్రమ కెమోషుజనులు నశించియున్నారు నీ కుమారులు చెరపట్టబడిరి చెరపట్టబడినవారిలో నీ కుమార్తెలున్నారు.
47అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబునుగూర్చిన శిక్షావిధి ముగిసెను.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.