Connect Christ

Telugu Bible · Old Testament

యోబు 31

Job 31 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?

2ఆలాగు చేసినయెడల పరముననున్న దేవుని ఆజ్ఞ యేమగును?ఉన్నతస్థలముననున్న సర్వశక్తుని స్వాస్థ్యమేమగును?

3దుర్మార్గులకు విపత్తు సంభవించుటే గదా పాపము చేయువారికి దురవస్థ ప్రాప్తించుటయే గదా.

4ఆయన నా ప్రవర్తన నెరుగుమ గదా నా అడుగుజాడలనన్నిటిని లెక్కించును గదా

5అబద్ధికుడనై నేను తిరుగులాడినయెడల మోసముచేయుటకై నా కాలు త్వరపడినయెడల

6నేను యథార్థుడనై యున్నానని దేవుడు తెలిసి కొనునట్లు

7న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. నేను త్రోవవిడిచి నడచినయెడల నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించినయెడల మాలిన్యమేమైనను నా చేతులకు తగిలినయెడల

8నేను విత్తినదానిని వేరొకడు భుజించును గాక నేను నాటినది పెరికివేయబడును గాక.

9నేను హృదయమున పరస్త్రీని మోహించినయెడల నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న యెడల

10నా భార్య వేరొకని తిరుగలి విసరును గాక ఇతరులు ఆమెను కూడుదురు గాక.

11అది దుష్కామకార్యము అది న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేరము

12అది నాశనకూపమువరకు దహించు అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును.

13నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసినయెడల

14దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును?

15గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.

16బీదలు ఇచ్ఛయించినదానిని నేను బిగబట్టినయెడలను విధవరాండ్రకన్నులు క్షీణింపజేసినయెడలను

17తలిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచె మైనను తిననియ్యక నేను ఒంటరిగా భోజనము చేసినయెడలను

18ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను

19వారి దేహములు నన్ను దీవింపకపోయినయెడలను వారు నా గొఱ్ఱలబొచ్చుచేత వేడిమి పొందకపోయిన యెడలను

20గుమ్మములో నాకు సహాయము దొరకునని తండ్రిలేనివారిని నేను అన్యాయము చేసినయెడలను

21నా భుజశల్యము దాని గూటినుండి పడును గాక నా బాహువు ఎముకలోనికి విరుగును గాక.

22నేనాలాగు చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కు లేనివాడు తండ్రిభావముతో నన్ను భావించి నాయొద్ద పెరిగెను.నా తల్లి గర్భమందు పుట్టిననాటనుండి దిక్కు లేని వానికి నేను మార్గదర్శినైతిని.

23దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.

24సువర్ణము నాకు ఆధారమనుకొనినయెడలను నా ఆశ్రయము నీవేయని మేలిమి బంగారముతో నేను చెప్పినయెడలను

25నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని గాని నేను సంతోషించిన యెడలను

26సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినేగాని చంద్రుడు మిక్కిలి కాంతికలిగి నడచుచుండగా అతనినేగాని చూచి

27నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారితట్టు చూచి నా నోరు ముద్దుపెట్టినయెడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును.

28అదియు న్యాయాధిపతులచేత శిక్ష నొందతగిన నేర మగును.

29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను

30నేనాలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు పాపముచేయుటకు నా నోటికి నేను చోటియ్యనే లేదు.

31అతడు పెట్టిన భోజనము తిని, తృప్తి పొందనివానిని చూపింపగలవారెవరని నా గుడారమందు నివసించువారు పలుకనియెడలను

32పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.

33ఆదాము చేసినట్లు నా దోషములను దాచి పెట్టుకొని

34మహా సమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగానుండి ద్వారము దాటి బయలు వెళ్లక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన యెడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవుదును

35నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను; ఇదిగో నా చేవ్రాలు గురుతు. ఇదిగో నా ప్రతివాది వ్రాసిన ఫిర్యాదు, సర్వశక్తుడు నాకుత్తరమిచ్చును గాక.

36నిశ్చయముగా నేను నా భుజముమీద దానిని వేసి కొందును నాకు కిరీటముగా దానిని ధరించుకొందును.

37నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసెదను, రాజు వలె నేనాయనయొద్దకు వెళ్లెదను.

38నా భూమి నామీద మొఱ్ఱపెట్టినయెడలను దాని చాళ్లు ఏకమై యేడ్చినయెడల

39క్రయధనము ఇయ్యక దాని ననుభవించినయెడలను దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన యెడలను

40గోధుమలకు ప్రతిగా ముళ్లును యవలకు ప్రతిగా కలుపును మొలచును గాక. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తము లాయెను.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.