Telugu Bible · Old Testament
యోబు 33
1యోబూ, దయచేసి నా వాదము నాలకించుము నా మాటలన్నియు చెవిని బెట్టుము.
2ఇదిగో నేను మాటలాడ నారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది.
3నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవినా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.
4దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను
5నీ చేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యె మాడుము.
6దేవునియెడల నేనును నీవంటివాడను నేనును జిగటమంటితో చేయబడినవాడనే
7నావలని భయము నిన్ను బెదరించదు నా చెయ్యి నీమీద బరువుగా నుండదు.
8నిశ్చయముగా నీ పలుకులు నా చెవినిబడెను నీ మాటల ధ్వని నాకు వినబడెను.
9ఏమనగానేను నేరములేని పవిత్రుడను మాలిన్యములేని పాపరహితుడను.
10ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
11ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు. నా త్రోవలన్నిటిని కనిపెట్టుచున్నాడని నీ వను చున్నావు.
12ఈ విషయములో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను.
13తన క్రియలలో దేనిగూర్చియు ఆయన ప్రత్యుత్తర మియ్యడు దేవుడు నరులశక్తికిమించినవాడు, నీవేల ఆయనతో పోరాడుదువు?
14దేవుడు ఒక్కమారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుష్యులు అది కనిపెట్టరు
15మంచముమీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టు నప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో
16నరులు గర్విష్ఠులు కాకుండచేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొనచేయునట్లు
17గోతికి పోకుండ వారిని కాపాడునట్లు కత్తివలన నశింపకుండ వారి ప్రాణమును తప్పించునట్లు
18ఆయన వారి చెవులను తెరవచేయును వారికొరకు ఉపదేశము సిద్ధపరచును.
19వ్యాధిచేత మంచమెక్కుటవలనను ఒకని యెముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును
20రొట్టెయు రుచిగల ఆహారమును వానికసహ్యమగును
21వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచు కొని వచ్చును
22వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకులయొద్దకు సమీపించును.
23నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
24దేవుడు వానియందు కరుణ జూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండ వానిని విడిపించును ప్రాయశ్చిత్తము నాకు దొరకెనని సెలవిచ్చును.
25అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరో గ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.
26వాడు దేవుని బతిమాలుకొనినయెడల ఆయన వానిని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషిం చును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును.
27అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు
28కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.
29ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగుచేత వెలిగింపబడునట్లు
30కూపములోనుండి వారిని మరల రప్పింపవలెనని మానవులకొరకు రెండు సారులు మూడు సారులు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడైయున్నాడు.
31యోబూ, చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడెదను.
32చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరు చున్నాను.
33మాట యేమియు లేనియెడల నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించె దను.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.