Connect Christ

Telugu Bible · Old Testament

యోబు 36

Job 36 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1మరియు ఎలీహు ఇంక యిట్లనెను

2కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది.

3దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.

4నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.

5ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.

6భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.

7నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.

8వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను

9అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును.

10ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.

11వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.

12వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.

13అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.

14కావున వారు ¸°వనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.

15శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును.

16అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.

17దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.

18నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.

19నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయుబాధనొందకుండ నిన్ను తప్పించునా?

20జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.

21జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు.

22ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?

23ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?

24మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.

25మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.

26ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.

27ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును

28మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.

29మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?

30ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.

31వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు

32ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును

33ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.