Connect Christ

Telugu Bible · Old Testament

యోబు 39

Job 39 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1అడవిలోని కొండమేకలు ఈనుకాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?

2అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి యీనుకాలము ఎరుగుదువా?

3అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును.

4వాటి పిల్లలు పుష్టికలిగి యెడారిలో పెరుగును అవి తల్లులను విడిచిపోయి వాటియొద్దకు తిరిగి రావు.

5అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు?

6నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని.

7పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు.

8పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.

9గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా?

10పగ్గము వేసి గురుపోతును నాగటిచాలులో కట్ట గలవా? అది నీచేత తోలబడి లోయలను చదరము చేయునా?

11దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా?

12అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్లమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా?

13నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా?

14లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును.

15దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవిజంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది.

16తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

17దేవుడు దానిని తెలివిలేనిదిగా జేసెను ఆయన దానికి వివేచనాశక్తి ననుగ్రహించి యుండ లేదు.

18అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్క రించును.

19గుఱ్ఱమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెండ్రుకలతో దాని మెడను కప్పితివా?

20మిడతవలె అది గంతులు వేయునట్లు చేయుదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము.

21మైదానములో అది కాలు దువ్వి తన బలమునుబట్టి సంతోషించును అది ఆయుధధారులను ఎదుర్కొనబోవును.

22అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొంద కుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు.

23అంబుల పొదియు తళతళలాడు ఈటెలును బల్లెమును దానిమీద గలగలలాడించబడునప్పుడు

24ఉద్దండకోపముతో అది బహుగా పరుగులెత్తును అది బాకానాదము విని ఊరకుండదు.

25బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.

26డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞవలననే తన రెక్కలు దక్షిణదిక్కునకు చాచునా?

27పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశవీధి కెక్కునా? తన గూడు ఎత్తయినచోటను కట్టుకొనునా?

28అది రాతికొండమీద నివసించును కొండపేటుమీదను ఎవరును ఎక్కజాలని యెత్తు చోటను గూడు కట్టుకొనును.

29అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును.

30దాని పిల్లలు రక్తము పీల్చును హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.