Telugu Bible · Old Testament
యోబు 41
1నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా?...దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా?
2నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
3అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా?
4నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసికొనునట్లు అది నీతో నిబంధనచేయునా?
5నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆట లాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాని కట్టివేసెదవా?
6బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా?
7దాని ఒంటినిండ ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తలనిండ చేప అలుగులు గుచ్చగలవా?
8దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసికొనిన యెడల నీవు మరల ఆలాగున చేయకుందువు.
9దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచు కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రముచేతనే యెవరికైనను గుండెలు అవిసిపోవును గదా.
10దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా యెదుట నిలువగలవాడెవడు?
11నేను తిరిగి ఇయ్యవలసి యుండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశవైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే గదా
12దాని అవయవములను గూర్చియైనను దాని మహాబల మునుగూర్చియైనను దాని చక్కని తీరునుగూర్చి యైనను పలుకక మౌనముగా నుండను.
13ఎవడైన దాని పై కవచమును లాగివేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైన రాగలడా?
14దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్లచుట్టు భయకంపములు కలవు
15దాని గట్టిపొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతనచేయబడి యున్నవి.
16అవి ఒకదానితో ఒకటి హత్తుకొని యున్నవి. వాటి మధ్యకు గాలి యేమాత్రమును జొరనేరదు.
17ఒకదానితో ఒకటి అతకబడి యున్నవి భేదింప శక్యము కాకుండ అవి యొకదానితో నొకటి కలిసికొని యున్నవి.
18అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పలవలె నున్నవి
19దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దానినుండి లేచును.
20ఉడుకుచున్న కాగులోనుండి, జమ్ముమంటమీద కాగు చున్న బానలోనుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములలోనుండి లేచును.
21దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోటనుండి జ్వాలలు బయలుదేరును
22దాని మెడ బలమునకు స్థానము భయము దానియెదుట తాండవమాడుచుండును
23దాని ప్రక్కలమీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు.
24దాని గుండె రాతివలె గట్టిగా నున్నది అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము.
25అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు అధిక భయముచేత వారు మైమరతురు.
26దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్క రకు రావు.
27ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కఱ్ఱగాను ఎంచును.
28బాణము దానిని పారదోలజాలదు వడిసెల రాళ్లు దాని దృష్టికి చెత్తవలె ఉన్నవి.
29దుడ్డుకఱ్ఱలు గడ్డిపరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును.
30దాని క్రిందిభాగములుకరుకైనచిల్లపెంకులవలె ఉన్నవి. అది బురదమీద నురిపిడికొయ్యవంటి తన దేహమును పరచుకొనును.
31కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగ జేయునుసముద్రమును తైలమువలె చేయును.
32అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింప జేయును చూచినవారికి సముద్రము నెరసిన వెండ్రుకలుగా తోచును.
33అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.
34అది గొప్పవాటినన్నిటిని తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికి అది రాజు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.