Telugu Bible · Old Testament
యెహోషువ 9
1యొర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారి రాజులందరు జరిగినదానిని వినినప్పుడు
2వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను యుద్ధము చేయుటకు కూడివచ్చిరి.
3యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబి యోను నివాసులు వినినప్పుడు
4వారు కపటోపాయము చేసి, రాయబారులమని వేషము వేసికొని బయలుదేరి, తమ గాడిదలకు పాత గోనెలుకట్టి పాతగిలి చినిగి కుట్ట బడియున్న ద్రాక్షా రసపు సిద్దెలు తీసికొని
5పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చు కొనిన భక్ష్యములన్నియు ఎండిన ముక్కలుగా నుండెను.
6వారు గిల్గాలునందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిమేము దూరదేశమునుండి వచ్చినవారము, మాతో నొక నిబంధనచేయుడని అతనితోను ఇశ్రాయేలీ యులతోను చెప్పగా
7ఇశ్రాయేలీయులుమీరు మా మధ్యను నివసించుచున్నవారేమో, మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివీ్వ యులతో ననిరి.
8వారుమేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువమీరు ఎవరు? ఎక్కడనుండి వచ్చితిరి? అని వారి నడుగగా
9వారునీ దేవుడైన యెహోవా నామ మునుబట్టి నీ దాసులమైన మేము బహుదూరమునుండి వచ్చి తివిు; ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును యొర్దానుకు అద్దరినున్న
10హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల యిద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి.
11అప్పుడు మా పెద్దలును మా దేశనివాసు లందరును మాతోమీరు ప్రయాణ ముకొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితోమేము మీ దాసులము గనుక మాతో నిబంధనచేయుడి అని చెప్పుడి అనిరి.
12మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధ పరచుకొని మా యిండ్లనుండి తెచ్చు కొనిన మా వేడి భక్ష్యములు ఇవే, యిప్పటికి అవి యెండి ముక్కలాయెను.
13ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, యిప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులును పాతగిలి పోయెనని అతనితో చెప్పిరి.
14ఇశ్రాయేలీయులు యెహోవాచేత సెలవుపొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా
15యెహోషువ ఆ వచ్చినవారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధనచేసెను. మరియు సమాజప్రధానులు వారితో ప్రమాణము చేసిరి.
16అయితే వారితో నిబంధన చేసి మూడు దినము లైన తరువాత, వారు తమకు పొరుగు వారు, తమ నడుమను నివసించువారే యని తెలిసికొనిరి.
17ఇశ్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణము లకు వచ్చిరి; వారి పట్టణములు గిబియోను కెఫీరా బెయే రోతు కిర్యత్యారీము అనునవి.
18సమాజ ప్రధానులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసియుండిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేయలేదు. కాగా సమాజమంతయు ప్రధా నులకు విరోధముగా మొఱ్ఱపెట్టిరి.
19అందుకు సమాజ ప్రధానులందరు సర్వసమాజముతో ఇట్లనిరిమనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతోడని వారితో ప్రమాణము చేసితివిు గనుక మనము వారికి హానిచేయ కూడదు.
20మనము వారితో చేసిన ప్రమాణమువలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమునుబట్టి వారిని బ్రదుక నియ్యవలెనని చెప్పి
21వారిని బ్రదుకనియ్యు డని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి.
22మరియు యెహోషువ వారిని పిలిపించి యిట్లనెనుమీరు మా మధ్యను నివసించువారై యుండియుమేము మీకు బహు దూరముగా నున్న వారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి?
23ఆ హేతువుచేతను మీరు శాపగ్రస్తులగుదురు, దాస్యము మీకెన్నడును మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై యుండకమానరు.
24అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.
25కాబట్టి మేము నీ వశమున నున్నాము; మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో యేది మంచిదో అదే చేయుమని యెహోషువకు ఉత్తర మిచ్చిరి.
26కాగా అతడు ఆలాగు చేసి ఇశ్రాయేలీయులు గిబియోనీయులను చంపకుండ వారి చేతులలోనుండి విడిపించెను.
27అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటుననుండు బలి పీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారు గాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటివరకు వారు ఆ పని చేయువారై యున్నారు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.