Connect Christ

Telugu Bible · New Testament

లూకా సువార్త 4

Luke 4 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింప బడి

2అపవాదిచేత1 శోధింపబడుచుండెను. ఆ దినము లలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

3అపవాదినీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను

4అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

5అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి

6ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

7కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.

8అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తర మిచ్చెను.

9పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టినీవు దేవుని కుమారుడవైతే ఇక్కడనుండి క్రిందికి దుముకుము

10నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.

11నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను.

12అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

13అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.

14అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్లెను; ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రదేశమం దంతట వ్యాపించెను.

15ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.

16తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

17ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతి కియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగి

19ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయననేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

22అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడిఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా

23ఆయన వారిని చూచివైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.

24మరియు ఆయనఏ ప్రవక్తయు స్వదేశ మందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాను.

25ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను,

26ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.

27మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

28సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని

29ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొని పోయిరి.

30అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.

31అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణము నకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించు చుండెను.

32ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.

33ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొక డుండెను.

34వాడునజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను.

35అందుకు యేసుఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారిమధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలి పోయెను.

36అందు కందరు విస్మయమొందిఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞా పింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితో నొకడు చెప్పుకొనిరి.

37అంతట ఆయననుగూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.

38ఆయన సమాజమందిరములోనుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయనయొద్ద మనవి చేసికొనిరి.

39ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.

40సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్దనుండిరో వారందరు ఆ రోగులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.

41ఇంతేకాక దయ్య ములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.

42ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా

43ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.

44తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.