Connect Christ

Telugu Bible · New Testament

మత్తయి సువార్త 6

Matthew 6 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1మనుష్యులకు కనబడవలెనని వారియెదుట మీ నీతి కార్యము చేయకుండ జాగ్రత్తపడుడి; లేనియెడల పరలోకమందున్న మీ తండ్రియొద్ద మీరు ఫలము పొందరు.

2కావున నీవు ధర్మము చేయునప్పుడు, మనుష్యులవలన ఘనత నొందవలెనని, వేషధారులు సమాజమందిరముల లోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింప వద్దు; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

3నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియకయుండవలెను.

4అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును

5మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

6నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.

7మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

8మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలి యును

9కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,

10నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,

11మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.

12మా ఋణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము.

13మమ్మును శోధనలోకి తేక దుష్టునినుండి1 మమ్మును తప్పించుము.

14మనుష్యుల అప రాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును

15మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయినయెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.

16మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

17ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.

18అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును.

19భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.

20పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

21నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.

22దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును.

23నీ కన్ను చెడినదైతే నీ దేహ మంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియై యుండిన యెడల ఆ చీకటి యెంతో గొప్పది.

24ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.

25అందువలన నేను మీతో చెప్పునదేమనగాఏమి తిందుమో యేమి త్రాగు దుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి;

26ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?

27మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు?

28వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు

29అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు.

30నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా.

31కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు.

32ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.

33కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.

34రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.