Connect Christ

Telugu Bible · Old Testament

సామెతలు 17

Proverbs 17 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు.

2బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును.

3వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే.

4చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి కుడు చెవియొగ్గును.

5బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచ బడడు.

6కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము.

7అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.

8లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవ ర్తించును.

9ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.

10బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.

11తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును.

12పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు

13మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు.

14కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

15నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు.

16బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా?

17నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.

18తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.

19కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు.

20కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును.

21బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.

22సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.

23న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును.

24జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును.

25బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును

26నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే.

27మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు.

28ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.