Telugu Bible · Old Testament
సామెతలు 29
1ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
2నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
3జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.
4న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును.
5తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు.
6దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును.
7నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
8అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
9జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును.
10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
11బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూప కుండును.
12అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
13బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
14ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
16దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచె దరు.
17నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
18దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
19దాసుడు వాగ్దండనచేత గుణపడడు తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
20ఆతురపడి మాటలాడువాని చూచితివా? వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
21ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమా రుడుగా ఎంచబడును.
22కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
23ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును
24దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.
25భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును యెహోవాయందు నమి్మక యుంచువాడు సురక్షిత ముగా నుండును.
26అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
27దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.