Telugu Bible · Old Testament
సామెతలు 8
1జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది
2త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను అది నిలుచుచున్నది
3గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది
4మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను.
5జ్ఞానములేనివారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలిసి కొనుడి బుద్ధిహీనులారా,బుద్ధియెట్టిదైనది యోచించి చూడుడి.
6నేను శ్రేష్ఠమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును
7నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము
8నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు
9అవియన్నియు వివేకికి తేటగాను తెలివినొందినవారికి యథార్థముగాను ఉన్నవి.
10వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి.
11జ్ఞానము ముత్యములకన్న శ్రేష్ఠమైనది విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు.
12జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.
13యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే. గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు.
14ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే.
15నావలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమునుబట్టి పాలనచేయుదురు.
16నావలన అధిపతులును లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు.
17నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
18ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నాయొద్ద నున్నవి.
19మేలిమి బంగారముకంటెను అపరంజికంటెను నావలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండికంటె నావలన కలుగు వచ్చుబడి దొడ్డది.
20నీతిమార్గమునందును న్యాయమార్గములయందును నేను నడచుచున్నాను.
21నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును.
22పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను.
23అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
24ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
25పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
26భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
27ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
28ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు
29జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు
30నేను ఆయనయొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతో షించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.
31ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.
32కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి నా మార్గముల ననుసరించువారు ధన్యులు
33ఉపదేశమును నిరాకరింపక దాని నవలంబించి జ్ఞానులై యుండుడి.
34అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.
35నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
36నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.