Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 106

Psalm 106 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.

2యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?

3న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.

4యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు

5నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.

6మా పితరులవలెనే మేము పాపము చేసితివిు దోషములు కట్టుకొని భక్తిహీనులమైతివిు

7ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి.

8అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.

9ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను.

10వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.

11నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

12అప్పుడు వారు ఆయన మాటలు నమి్మరి ఆయన కీర్తి గానము చేసిరి.

13అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.

14అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి

15వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.

16వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి.

17భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.

18వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.

19హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి

20తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి.

21ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను

22ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.

23అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను

24వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి

25యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి.

26అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును

27అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకునుఆయన వారిమీద చెయ్యి యెత్తెను.

28మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.

29వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను.

30ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను.

31నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను.

32మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.

33ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.

34యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.

35అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.

36వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.

37మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.

38నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను

39తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.

40కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.

41ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి.

42వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువులచేతి క్రింద అణపబడిరి.

43అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.

44అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.

45వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.

46వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.

47యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్నుస్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.

48ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్‌ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.