Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 109

Psalm 109 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము

2నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.

3నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు

4నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.

5నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.

6వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.

7వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక

8వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.

9వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక

10వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక

11వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక

12వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక

13వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక

14వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక

15ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు చుండునుగాక.

16ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.

17శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.

18తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది

19తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.

20నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.

21యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.

22నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది.

23సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు

24ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.

25వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు

26యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు నట్లు

27నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.

28వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.

29నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక

30నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.

31దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.