Telugu Bible · Old Testament
కీర్తనల గ్రంథము 69
1దేవా, జలములు నా ప్రాణముమీద పొర్లుచున్నవి నన్ను రక్షింపుము.
2నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.
3నేను మొఱ్ఱపెట్టుటచేత అలసియున్నాను నా గొంతుక యెండిపోయెను నా దేవునికొరకు కనిపెట్టుటచేత నా కన్నులు క్షీణించిపోయెను.
4నిర్నిమిత్తముగా నామీద పగపట్టువారు నా తలవెండ్రుకలకంటె విస్తారముగా ఉన్నారు అబద్ధమునుబట్టి నాకుశత్రువులై నన్ను సంహరింప గోరువారు అనేకులు నేను దోచుకొననిదానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను.
5దేవా, నా బుద్ధిహీనత నీకు తెలిసేయున్నది నా అపరాధములు నీకు మరుగైనవి కావు.
6ప్రభువా, సైన్యములకధిపతివగు యెహోవా, నీకొరకు కనిపెట్టుకొనువారికి నావలన సిగ్గు కలుగ నియ్యకుము ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదకువారిని నావలన అవమానము నొంద నియ్యకుము.
7నీ నిమిత్తము నేను నిందనొందినవాడనైతిని నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను.
8నా సహోదరులకు నేను అన్యుడనైతిని నా తల్లి కుమారులకు పరుడనైతిని.
9నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.
10ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను.
11నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు వారికి హాస్యాస్పదుడనైతిని.
12గుమ్మములలో కూర్చుండువారు నన్నుగూర్చి మాట లాడుకొందురు త్రాగుబోతులు నన్నుగూర్చి పాటలు పాడుదురు.
13యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపాబాహుళ్యమునుబట్టి నీ రక్షణ సత్యమునుబట్టి నాకుత్తరమిమ్ము.
14నేను దిగిపోకుండ ఊబిలోనుండి నన్ను తప్పించుము నా పగవారిచేతిలోనుండి అగాధజలములలోనుండి నన్ను తప్పించుము.
15నీటివరదలు నన్ను ముంచనియ్యకుము అగాధసముద్రము నన్ను మింగనియ్యకుము గుంట నన్ను మింగనియ్యకుము.
16యెహోవా, నీ కృప ఉత్తమత్వమునుబట్టి నాకు ఉత్తర మిమ్ము నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టి నాతట్టు తిరుగుము.
17నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.
18నాయొద్దకు సమీపించి నన్ను విమోచింపుము. నా శత్రువులను చూచి నన్ను విడిపింపుము.
19నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెననినీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.
20నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవ రును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటినిగాని యెవరును కానరారైరి.
21వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
22వారి భోజనము వారికి ఉరిగా నుండును గాక వారు నిర్భయులై యున్నప్పుడు అది వారికి ఉరిగా నుండును గాక.
23వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక వారి నడుములకు ఎడతెగని వణకు పుట్టించుము.
24వారిమీద నీ ఉగ్రతను కుమ్మరించుము నీ కోపాగ్ని వారిని పట్టుకొనును గాక
25వారి పాళెము పాడవును గాక వారి గుడారములలో ఎవడును ఉండకపోవును గాక
26నీవు మొత్తినవానిని వారు తరుముచున్నారు నీవు గాయపరచినవారి వేదనను వివరించుచున్నారు.
27దోషముమీద దోషము వారికి తగులనిమ్ము నీ నీతి వారికి అందనీయకుము.
28జీవగ్రంథములోనుండి వారి పేరును తుడుపు పెట్టుము నీతిమంతుల పట్టీలో వారి పేరులు వ్రాయకుము.
29నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక.
30కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను
31ఎద్దుకంటెను, కొమ్ములును డెక్కలునుగల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము
32బాధపడువారు దాని చూచి సంతోషించుదురు దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక.
33యెహోవా దరిద్రుల మొఱ్ఱ ఆలకించువాడు ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించు వాడు కాడు.
34భూమ్యాకాశములు ఆయనను స్తుతించును గాక సముద్రములును వాటియందు సంచరించు సమస్త మును ఆయనను స్తుతించును గాక.
35దేవుడు సీయోనును రక్షించును ఆయన యూదా పట్టణములను కట్టించును జనులు అక్కడ నివసించెదరు అది వారివశమగును.
36ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించు కొనును ఆయన నామమును ప్రేమించువారు అందులో నివ సించెదరు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.