Telugu Bible · Old Testament
కీర్తనల గ్రంథము 73
1ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
2నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
3భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
4మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
5ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
6కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
7క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి
8ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
9ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.
10వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
11దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
12ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
13నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
14దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
15ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
16అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
17నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
18నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
19క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
20మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు.
21నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
22నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
23అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
24నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
25ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు.
26నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.
27నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు.
28నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.