Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 96

Psalm 96 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి

2యెహోవామీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి.

3అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి

4యెహోవా మహాత్మ్యముగలవాడు ఆయన అధికస్తోత్రము పొందతగినవాడు సమస్త దేవతలకంటెను ఆయన పూజనీయుడు.

5జనముల దేవతలందరు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవిశాలమును సృజించినవాడు.

6ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలసౌందర్యములు ఆయన పరిశుద్ధస్థలములో ఉన్నవి.

7జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి మహిమబలములు యెహోవాకు చెల్లించుడి.

8యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసికొని ఆయన ఆవరణములలోనికి రండి.

9పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారముచేయుడి సర్వభూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి.

10యెహోవా రాజ్యము చేయుచున్నాడు లోకము కదలకుండ స్థిరపరచబడియున్నది న్యాయమునుబట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి

11యెహోవా వేంచేయుచున్నాడు ఆకాశము సంతోషించునుగాక భూమి ఆనందించును గాక సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక.

12పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నియు ఉత్సాహధ్వని చేయునుగాక.

13భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు చున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.