Connect Christ

Telugu Bible · Old Testament

పరమగీతము 3

Song of Solomon 3 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.

2నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.

3పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా? అని నేనడిగి తిని

4నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడెను వదలిపెట్టక నేనతని పట్టుకొంటిని నా తల్లి యింటికతని తోడుకొని వచ్చితిని నన్ను కనినదాని యరలోనికి తోడుకొని వచ్చితిని.

5యెరూషలేము కుమార్తెలారా, పొలములోని యిఱ్ఱులనుబట్టియు లేళ్లనుబట్టియు మీచేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

6ధూమ స్తంభములవలె అరణ్యమార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులమ్ము వివిధ మైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు ఇది ఏమి?

7ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అరువదిమంది శూరులు దానికి పరివారము వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు వారందరును ఖడ్గధారులు యుద్ధవీరులు

8రాత్రి భయముచేత వారు ఖడ్గము ధరించి వచ్చు చున్నారు.

9లెబానోను మ్రానుతో మంచమొకటి సొలొమోనురాజు తనకు చేయించుకొని యున్నాడు.

10దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణవస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలిభాగము నలంక రించిరి.

11సీయోను కుమార్తెలారా, వేంచేయుడి కిరీటము ధరించిన సొలొమోనురాజును చూడుడి వివాహదినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరము.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.