Faith · 2 October 2026
వేలాది కాగడాల వెలుగులో లూర్ద్‌లో పోప్ లియో XIV జపమాల ప్రార్థన
లూర్ద్‌లో పోప్ లియో XIV వేలాది మంది యాత్రికులతో కలిసి జపమాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కాగడాల ఊరేగింపులో పాల్గొని, మరియా మాత పుణ్యక్షేత్రాన్ని ప్రార్థనామయ వాతావరణంలో నింపారు.
లూర్ద్, ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ లూర్ద్ పుణ్యక్షేత్రంలో పోప్ లియో XIV సెప్టెంబర్ 27న వేలాది మంది యాత్రికులతో కలిసి జపమాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి కాగడాల ఊరేగింపులో పాల్గొని, ఆధ్యాత్మికతతో నిండిన సాయంత్రాన్ని గడిపారు. రాత్రి 9 గంటలకు మస్సాబియెల్ గుహ నుంచి కాగడాల ఊరేగింపు ప్రారంభమైంది. పోప్ లియో XIV వెంట పోప్ ప్రతినిధులు, బిషప్‌లు, ఫాదర్లు, స్వచ్ఛంద సేవకులు, కుటుంబాలు, వేలాది మంది యాత్రికులు పాల్గొన్నారు. కాగడాలు చేతబట్టి సాగిన ఊరేగింపులో మరియా మత స్వరూపాన్ని భక్తిశ్రద్ధలతో ముందుకు తీసుకెళ్లారు. వివిధ దేశాల నుంచి వచ్చిన యాత్రికులు తమ తమ భాషల్లో జపమాల ప్రార్థనలు చేస్తూ, మరియా మాతను స్తుతిస్తూ గీతాలు ఆలపించారు. రాత్రి చీకటిలో వెలిగిన వేలాది కాగడాలు లూర్ద్ పుణ్యక్షేత్రాన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. లూర్ద్‌లో యాత్రికులు పుణ్యక్షేత్రం చుట్టూ నడుస్తూ వివిధ భాషల్లో జపమాల ప్రార్థన చేయడం దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం. పోప్ లియో XIV కూడా ఈ సంప్రదాయంలో విశ్వాసులతో కలిసి పాల్గొన్నారు. లూర్ద్‌కు ప్రత్యేకమైన విశ్వాస చరిత్ర ఫ్రాన్స్‌లోని లూర్ద్ నగరంలోని మస్సాబియెల్ గుహ కాథలిక్ విశ్వాసంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. 1858 ఫిబ్రవరి 11 నుంచి జూలై 16 మధ్య కాలంలో 14 ఏళ్ల బెర్నాడెట్ సుబిరూస్‌కు మరియా మాత 18 సార్లు దర్శనమిచ్చారని కాథలిక్ సంప్రదాయం చెబుతోంది. ఆ దర్శనాల్లో మరియా మాత తనను “అమలోద్భవం” (Immaculate Conception)గా పరిచయం చేసుకున్నారని విశ్వాసం. ఈ సంఘటనల అనంతరం లూర్ద్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మరియా మాత పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. ప్రతి సంవత్సరం అనేక మంది యాత్రికులు ప్రార్థన, ఆధ్యాత్మిక అనుభూతి మరియు ఆశ కోసం ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పోప్ లియో XIV పాల్గొన్న జపమాల ప్రార్థన, కాగడాల ఊరేగింపు లూర్ద్ పుణ్యక్షేత్రం యొక్క దీర్ఘకాలిక ప్రార్థనా సంప్రదాయాన్ని మరోసారి ప్రపంచం ముందుకు తీసుకువచ్చాయి.


