Faith · 2 October 2026
అక్టోబర్‌లో ఈ ప్రత్యేక ప్రార్థన చేయాలని పోప్ లియో పిలుపు.. అసలు ఉద్దేశం ఏమిటంటే?
మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి అండగా నిలవాలని, తీర్పుల్లేకుండా వారిని ఆలకించి, ఆదరించాలని పోప్ లియో XIV అక్టోబర్ ప్రార్థనా ఉద్దేశంగా పిలుపునిచ్చారు.
వాటికన్ సిటీ: అక్టోబర్ నెలకు సంబంధించిన తన ప్రార్థనా ఉద్దేశాన్ని పోప్ లియో XIV ప్రకటించారు. మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి చర్చి అండగా నిలవాలని, వారిని తీర్పు లేకుండా ఆలకిస్తూ ప్రేమతో తోడుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మానసిక సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్నవారి కోసం ఈ నెలంతా ప్రత్యేకంగా ప్రార్థించాలని పోప్ కోరారు. ఆందోళన, డిప్రెషన్ లేదా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి దేవునిలో గౌరవం, ఆశ లభించాలని ఆయన ప్రార్థించారు. మానసిక అనారోగ్యంతో ఉన్నవారిపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించాల్సిన అవసరాన్ని కూడా పోప్ తన ప్రార్థనలో ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికీ స్థానం ఉండేలా చర్చి ఒక సురక్షితమైన, ఆత్మీయమైన సమాజంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. “తీర్పు లేకుండా వినే, భయపడకుండా దగ్గరకు వచ్చే” సమాజంగా చర్చి ఉండాలని పోప్ ప్రార్థించారు. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని మాత్రమే కాకుండా, వారికి సేవ చేస్తున్న వైద్య నిపుణులు, కుటుంబ సభ్యులు, స్వచ్ఛంద సేవకులను కూడా ప్రార్థనలో గుర్తు చేసుకున్నారు. వారికి అవసరమైన బలం, కరుణ ప్రసాదించాలని దేవునిని కోరారు. మానసిక ఆరోగ్య సంరక్షణను చర్చి సమాజాల జీవితం, సేవలో మరింతగా భాగం చేయాలని పోప్ పిలుపునిచ్చారు. అక్టోబర్ ప్రార్థనా ఉద్దేశం ద్వారా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నవారిని ఒంటరిగా విడిచిపెట్టకుండా, వారితో కలిసి నడవడం, వారి మాటలను వినడం, గౌరవం మరియు ఆశను అందించడం ప్రతి క్రైస్తవుడి బాధ్యతగా గుర్తుచేశారు.


