Connect Christ

Faith · 1 October 2026

స్కాట్లాండ్‌‌లో 6వ శతాబ్దపు పురాతన క్రైస్తవ మఠం, బంగారు ఆభరణాల మూసలు లభ్యం!

లిస్‌మోర్ ద్వీపంలో 6వ శతాబ్దపు క్రైస్తవ మఠానికి చెందిన సమాధులు, శిల్పాలు, 7వ శతాబ్దపు బంగారం, వెండి, రాగి ఆభరణాల మూసలు బయటపడ్డాయి. ఈ ఆవిష్కరణ స్కాట్లాండ్ క్రైస్తవ మత వ్యాప్తిపై కొత్త వెలుగునిచ్చింది.

స్కాట్లాండ్‌‌లో 6వ శతాబ్దపు పురాతన క్రైస్తవ మఠం, బంగారు ఆభరణాల మూసలు లభ్యం!

చిన్న ద్వీపంలో వెలుగుచూసిన అపూర్వ చరిత్ర: స్కాట్లాండ్‌లో 6వ శతాబ్దపు పురాతన క్రైస్తవ మఠం లభ్యం! స్కాట్లాండ్‌లోని ఆర్గిల్ తీరం సమీపంలో ఉన్న లిస్‌మోర్ (Lismore) అనే చిన్న ద్వీపంలో స్థానిక గ్రామీణులు మరియు స్వచ్ఛంద వేత్తలు చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో ప్రపంచాన్ని ఆకర్షించే అపూర్వ చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. స్కాట్లాండ్‌లో క్రైస్తవ మత ప్రచారం ఏ విధంగా ప్రారంభమైందో తెలిపే 6వ శతాబ్దపు నాటి పురాతన క్రైస్తవ మఠం యొక్క ఆనవాళ్లను ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. సొంత నిధులతో తవ్వకాలు జరిపిన స్థానికులు లిస్‌మోర్ ద్వీపంలో 6వ శతాబ్దంలో ఐర్లాండ్ నుండి వచ్చిన మిషనరీలు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి మఠాన్ని ఏర్పాటు చేశారని కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ, రాతపూర్వక ఆధారాలు తప్ప ప్రత్యక్ష ఆనవాళ్లు లభించలేదు. దీంతో స్థానిక 'హెరిటేజ్ సొసైటీ' సభ్యులు క్రాడ్ ఫండింగ్ మరియు విరాళాల ద్వారా నిధులు సేకరించి, 'ఆర్గిల్ ఆర్కియాలజీ'కి చెందిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ క్లేర్ ఎల్లిస్ నాయకత్వంలో స్థానిక గ్రామస్థులతో కలిసి ఒక కేథడ్రల్ ప్రాంగణంలో తవ్వకాలు ప్రారంభించారు. అరుదైన బంగారు, వెండి ఆభరణాల మూసలు ఈ తవ్వకాల్లో 6వ శతాబ్దానికి చెందిన విస్తారమైన సమాధుల ప్రాంగణం, శిల్పకళతో కూడిన రాతి నిర్మాణాలు, భవనాల అవశేషాలు బయటపడ్డాయి. వీటితో పాటు 7వ శతాబ్దంలో బంగారం, వెండి మరియు రాగి లోహాలను కరిగించి ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించిన అత్యంత చిన్న, అరుదైన మట్టి మూసలు (Crucibles) పెద్ద సంఖ్యలో లభ్యమయ్యాయి. ఈ పరిశోధనలను సమన్వయం చేసిన మాజీ శాస్త్రవేత్త రాబర్ట్ హే మాట్లాడుతూ.. "మా చిన్న ద్వీపంలో 7వ శతాబ్దంలోనే బంగారం, వెండిని కరిగించి నాణ్యమైన ఆభరణాలు తయారు చేశారనే నిజం తెలిసి మేము ఆశ్చర్యపోయాము" అని ఆనందం వ్యక్తం చేశారు. చరిత్రను తిరగరాసిన 'సెయింట్ మో లువాక్' మఠం ఈ మఠాన్ని 'సెయింట్ మో లువాక్' (Saint Moluag) స్థాపించారు. ఇప్పటివరకు స్కాట్లాండ్‌లోని 'ఐయోనా' (Iona) ప్రాంతంలో ఉన్న సెయింట్ కొలంబ మఠానికే ఎక్కువ ప్రాముఖ్యత ఉండగా, తాజా ఆధారాలతో లిస్‌మోర్‌‌లోని 'లియోస్ మోర్' (Lios Mór) మఠం కూడా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రధాన క్రైస్తవ కేంద్రమని స్పష్టమైంది. అబెర్డీన్ విశ్వవిద్యాలయ పురావస్తు ఆచార్యుడు ప్రొఫెసర్ గోర్డాన్ నోబుల్ మాట్లాడుతూ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో బయటపడిన ఈ ఆధారాలు స్కాట్లాండ్ తొలి క్రైస్తవ చరిత్రను పునర్లిఖిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిశోధన విశేషాలు త్వరలోనే 'యాంటిక్విటీ' (Antiquity) పరిశోధన పత్రికలో ప్రచురితం కానున్నాయి.

More news

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.