Telugu Bible · Old Testament
సామెతలు 22
1గొప్ప ఐశ్వర్యముకంటె మంచి పేరును వెండి బంగారములకంటె దయయు కోరదగినవి.
2ఐశ్వర్యవంతులును దరిద్రులును కలిసియుందురు వారందరిని కలుగజేసినవాడు యెహోవాయే.
3బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
4యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయ మునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.
5ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.
6బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
7ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పుచేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు.
8దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
9దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెననొందును.
10తిరస్కారబుద్ధిగలవాని తోలివేసినయెడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును.
11హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును.
12యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.
13సోమరిబయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదుననును.
14వేశ్య నోరు లోతైనగొయ్యి యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును.
15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
16లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
17చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము.
18నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము.
19నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి యున్నాను?
20నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై
21ఆలోచనయు తెలివియుగల శ్రేష్ఠమైన సామెతలు నేను నీకొరకు రచించితిని.
22దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు.
23యెహోవా వారి పక్షమున వ్యాజ్యెమాడును ఆయన వారిని దోచుకొనువారి ప్రాణమును దోచు కొనును.
24కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము
25నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
26చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
27చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపో నేల?
28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
29తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదు టనే నిలుచును.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.