Connect Christ

Telugu Bible · Old Testament

సామెతలు 23

Proverbs 23 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచిం చుము.

2నీవు తిండిపోతువైనయెడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.

3అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు.

4ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.

5నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరి పోవును.

6ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకుము.

7అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొను వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.

8నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.

9బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.

10పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడ కూడదు

11వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

12ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.

13నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును

14బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించె దవు.

15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.

16నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.

17పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుము.

18నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు.

19నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము.

20ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగాతినువారితోనైనను సహ వాసము చేయకుము.

21త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.

22నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.

23సత్యమును అమి్మవేయక దాని కొనియుంచు కొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియుంచు కొనుము.

24నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును.

25నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.

26నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,

27వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.

28దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.

29ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?

30ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.

31ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.

32పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును.

33విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

34నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.

35నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును? మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.