Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 50

Psalm 50 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు తూర్పుదిక్కు మొదలుకొని పడమటి దిక్కువరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు.

2పరిపూర్ణ సౌందర్యముగల సీయోనులోనుండి దేవుడు ప్రకాశించుచున్నాడు

3మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయనచుట్టు ప్రచండవాయువు విసరుచున్నది.

4ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై

5బల్యర్పణ చేత నాతో నిబంధన చేసికొనిన నా భక్తులను నాయొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు.

6దేవుడు తానే న్యాయకర్తయై యున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది.(సెలా.)

7నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆల కించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవు డను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

8నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహనబలులు నిత్యము నాయెదుట కనబడుచున్నవి.

9నీ యింటనుండి కోడెనైనను నీ మందలోనుండి పొట్టేళ్లనైనను నేను తీసికొనను.

10అడవిమృగములన్నియు వేయికొండలమీది పశువులన్నియు నావేగదా

11కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.

12లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను.

13వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?

14దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.

15ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు.

16భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి?

17దిద్దుబాటు నీకు అసహ్యముగదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు.

18నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు.

19కీడుచేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది.

20నీవు కూర్చుండి నీ సహోదరునిమీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారునిమీద అపనిందలు మోపుచున్నావు.

21ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినైయుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను

22దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి లేనియెడల నేను మిమ్మును చీల్చివేయుదును తప్పించు వాడెవడును లేకపోవును

23స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమ పరచు చున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.