Telugu Bible · Old Testament
కీర్తనల గ్రంథము 51
1దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము
2నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
3నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపమెల్లప్పుడు నాయెదుట నున్నది.
4నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి యున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.
5నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
6నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు.
7నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము.
8ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన యెముకలు హర్షించును.
9నా పాపములకు విముఖడవు కమ్ము నా దోషములన్నిటిని తుడిచివేయుము.
10దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతన ముగా పుట్టించుము.
11నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము.
12నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.
13అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను పాపులును నీ తట్టు తిరుగుదురు.
14దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.
15ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
16నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు.
17విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.
18నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము యెరూషలేముయొక్క గోడలను కట్టించుము.
19అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతము లగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెల నర్పించె దరు.
Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.
Listen in the Connect Christ app
Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.