Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 89

Psalm 89 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1యెహోవాయొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియ జేసెదను.

2కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందువనియు నేననుకొనుచున్నాను.

3నేను ఏర్పరచుకొనినవానితో నిబంధన చేసి యున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను

4తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి యున్నాను. (సెలా.)

5యెహోవా, ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్యకార్యము లను స్తుతించుచున్నది పరిశుద్ధదూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.

6మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?

7పరిశుద్ధదూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టునున్న వారందరికంటె భయంకరుడు.

8యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు.

9సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచి వేయుచున్నావు.

10చంపబడినదానితో సమానముగా నీవు రహబును, ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి.

11ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి.

12ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమునుబట్టి ఉత్సాహ ధ్వని చేయుచున్నవి.

13పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.

14నీతిన్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు.

15శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచు కొనుచున్నారు.

16నీ నామమునుబట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు. నీ నీతిచేత హెచ్చింపబడుచున్నారు.

17వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీదయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది.

18మా కేడెము యెహోవావశము మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు.

19అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి యుంటివి నేను ఒక శూరునికి సహాయము చేసియున్నాను ప్రజలలోనుండి యేర్పరచబడిన యొకని నేను హెచ్చించియున్నాను.

20నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను.

21నా చెయ్యి యెడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును.

22ఏ శత్రువును అతనిమీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు.

23అతనియెదుట నిలువకుండ అతని విరోధులను నేను పడగొట్టెదను. అతనిమీద పగపట్టువారిని మొత్తెదను.

24నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును. నా నామమునుబట్టి అతని కొమ్ము హెచ్చింపబడును.

25నేను సముద్రముమీద అతని చేతిని నదులమీద అతని కుడిచేతిని ఉంచెదను.

26నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును.

27కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను.

28నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.

29శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను.

30అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల

31వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల

32నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను.

33కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను.

34నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను.

35అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు

36చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు

37నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని దావీదుతో నేను అబద్ధమాడను.

38ఇట్లు సెలవిచ్చి యుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించియున్నావు నీ అభిషిక్తునిమీద నీవు అధికకోపము చూపి యున్నావు.

39నీ సేవకుని నిబంధన నీకసహ్యమాయెను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరచి యున్నావు.

40అతని కంచెలన్నియు నీవు తెగగొట్టియున్నావు అతని కోటలు పాడుచేసియున్నావు

41త్రోవను పోవువారందరు అతని దోచుకొనుచున్నారు అతడు తన పొరుగువారికి నిందాస్పదుడాయెను.

42అతని విరోధుల కుడిచేతిని నీవు హెచ్చించియున్నావు అతని శత్రువులనందరిని నీవు సంతోషపరచి యున్నావు

43అతని ఖడ్గము ఏమియు సాధింపకుండ చేసియున్నావు యుద్ధమందు అతని నిలువబెట్టకున్నావు

44అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టియున్నావు

45అతని ¸°వనదినములను తగ్గించియున్నావు. సిగ్గుతో అతని కప్పియున్నావు (సెలా.)

46యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

47నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి యున్నావు?

48మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?

49ప్రభువా, నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమా ణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ?

50ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము.

51యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతలమీద వారు మోపుచున్న నిందలు.

52యెహోవా నిత్యము స్తుతినొందును గాక ఆమేన్‌ ఆమేన్‌.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.