Connect Christ

Telugu Bible · Old Testament

కీర్తనల గ్రంథము 90

Psalm 90 · Telugu Old Version (1880)

Listen in the appRead in EnglishAll chapters

1ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.

2పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు

3నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

4నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.

5వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగిరింతురు

6ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.

7నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

8మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడు చున్నవి.

9నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితివిు. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.

10మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్న యెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

11నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?

12మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

13యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.

14ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.

15నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోష పరచుము.

16నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.

17మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.

Telugu Old Version (1880) — public domain. Text via WordProject.org.

Listen in the Connect Christ app

Full lyrics, audio with background playback, a Telugu and English Bible with narration, live prayer with ministers, and churches near you. Free on Android and iPhone.